సకలపూజలు.కాం ప్రేక్షక వీక్షకులందరికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో దేవకీ, వసుదేవులకు శ్రావణ బహుళ అష్టమి నాడు జనిమించడం జరిగినది. ముఖ్యముగా శ్రీ కృష్ణా వతారములోని అంతరార్ధమును తెలుసుకునే ప్రయత్నం చేస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణగా మనకు అర్ధం అవుతుంది.
శ్రీ కృష్ణుని మేనమామ అయిన కంసుడు తన తండ్రిని రాజ్య బ్రష్టుడిని కావించి కారాగారములో బంధించినాడు. శ్రీకృష్ణుడు కంసుని చంపి అతని తండ్రి ఉగ్రసేనునికి ఆ రాజ్యమును అప్పగించడం జరిగినది. ఇతడు చిన్నతనములోనే నందుని ఇంట పెరుగుచున్నపుడు పూతన, శకటాసుర, ధేనుకాసుర, బకాసుర, కేళి,అఘాసుర మొదలగు రాక్షసులను చంపి ధర్మ రక్షణ గావించినాడు. కంసుడు, శిశుపాలురను కూడా అణచినాడు. తన మేనత్త కుమారులైన కౌరవులు, పాండవుల మధ్య విభేదాలను అణచినాడు . పాండవులు ధర్మాత్ములై మెలగు చుండగా కౌరవులు వీరి రాజ్యం కబళించటానికి అనేక ప్రయత్నములు చేసి, జూదము ఆడించి వారి రాజ్యమును, భార్యను,సర్వ సంపదను హరించారు. పాండవులు ఈ విధమైన దుష్క్రుత్యములను సహించలేక శ్రీకృష్ణుని దైవముగా నెంచి శరణు కోరగా కురుక్షేత్రమున పాండవులకు, కౌరవులకు జరిగిన యుద్దంలో పాండవులకు రథసారధి యై కౌరవులను నశింపచేసి పాండవులను రక్షించెను.
శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. ధర్మ పరంగా రాజనీతి తెలిసినవాడు ధర్మ రక్షణే కర్తవ్యంగా ఎన్ని నిందలు వచ్చినా భారించినవాడు. శ్రీ కృష్ణుని ప్రవర్తన అర్ధంకాని అర్జునునకు కృష్ణుడు రణరంగంలో గీతను భోదించాడు. శ్రీ కృష్ణుడు ఉపదేశించిన ఈ గీత " భగవద్గీత " గా లోకమున ప్రసిద్ది చెందింది. ఈ గీత భోద విన్న అర్జునుడు తన అజ్ఞానం తొలగించుకొని యుద్ధం చేసి విజయం పొందాడు.ఎప్పుడు లోకంలో ధర్మం నశించి అధర్మం వృద్ది పొందితే అప్పుడల్లా నేను అవతరిస్తానని శ్రీ కృష్ణుడు ' గీత ' లో ఉపదేశించాడు.శ్రీ కృష్ణుడు చేసిన ప్రతి పనిలో ఈ గీత యొక్క అంతరార్దం నిలిచిఉన్నదని మహాత్ములైనవారు విశ్వసించారు. దీనినే కృష్ణ తత్వంగా కూడా వారు అభివర్ణించారు. ఈ విధంగా శ్రీ కృష్ణుడు జగద్గురువు.
కృష్ణాష్టమి పండుగను పల్లెలు, పట్టణాలలో కూడా భక్తి, శ్రద్దలతో జరుపుకొంటారు. చిన్నపిల్లలకు బాలకృష్ణుని వేషధారణ చేసి వారి చేత భగవద్గీత , రామాయణ శ్లోకాలు గానం చేయించుట జరుపుతారు.ఉట్లు కొడతారు. గీత అంతా యోగామునే భోదిస్తుంది. శ్రీ కృష్ణుని యోగీశ్వరుడు అంటారు.మన ఆధ్యాత్మిక పరంపరలో నిలిచియున్న ఈ పండుగను కొంతమంది భక్తితో ఉపవాసముండి ఆ రోజును గడుపుతారు.