పూరీ దేవాలయం రధయాత్రకు ప్రసిద్ధి. ప్రతియేడాది ఆషాఢ శుద్ధ విదియనాడు ఈ రధ యాత్ర జరుగుతుంది. కులమత భేదాలు లేకుండా అందరూ ఇందులో పాల్గొంటారు. ఈ జగత్తుకే నాధుడైన ఆ జగన్నాధుడు తానే కదలివచ్చే కమనీయ దృశ్యం ఈ రధయాత్ర. సుమారు 3 కి. మీ. పొడవునా సాగే ఈ రధయాత్రలో భక్తులు భగవంతుని ఒకే పిలిపుతో పిలుస్తూ చేసే ధ్వనులకు భూమి దద్దరిల్లి పోతుందేమో అనిపిస్తుంది. ఈ రధయాత్రను సందర్శిస్తే చాలు పునర్జన్మ వుండదని నమ్మకం. కాని .... ఇంతటి కమనీయమైన రధయాత్ర చూడటానికి ఎన్ని జన్మలున్నా సరిపోవనిపిస్తుంది.
సముద్ర తీరాన.... పచ్చటి ప్రకృతిలో.... కొలువైవుంది పూరీ.
ఇక్కడి దేవుడు జగన్నాధుడు. ఏటా జగన్నాదునికి జరిగే రధయాత్ర ప్రత్యేకమైనది. ఈ జగన్నాధుడు ఆత్మీయ అనురాగాలకు ప్రతీక. ప్రపంచములో ఇక్కడ మాత్రమే అన్నాచెల్లెళ్ళకు గుడి వుంది. ఇక్కడి సుభద్ర బలభద్ర సమేతుడైన జగన్నాధుని విగ్రహాలు "దారువు" తో తయారు చేసినవి. చెంపకు చారెడు కళ్ళతో వున్న వీటిని చూస్తుంటే ప్రపంచాన్ని వీరు తమ చల్లని చూపుతో కాపాడుతున్నట్లు వుంటుంది. మరో చిత్రమేమిటంటే వీరికి చేతులు వుండవు.
చారిత్రక ఆధారం:
కళింగ రాజు అనంత వర్మ చోడంగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు వున్నాయి. దీనికి క్రీ. శ. 1174 లో ఒరిస్సా ప్రభువైన అనంగ భీమ దేవుడు ఈ విగ్రహాలకు పూర్తి రూపం తీసుకువచ్చారు. క్రీ. శ 1558 లో ఆఫ్గాన్ రాజు కాలాపహాడ్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత వచ్చిన రామచంద్ర దేవుడు ఈ ఆలయాన్ని సంప్రోక్షణ చేసి విగ్రహాలను పున:ప్రతిష్టించాడు.
పురాణ ఆధారాలు :
స్కాంద, బ్రహ్మ పురాణాలు జగన్నాధుని నీల మాధవునిగా " సవర " ( గిరిజన ) రాజు అయిన విశ్వవసు కొలిచేవాడని చెబుతోంది. ఈ దేవుని గురించి విన్న ఇంద్రద్యుమ్న మహారాజు కులపురోహితుడైన విద్యాపతిని పిలిచి, ఆ దైవం ఎక్కడున్నది తెలుసుకురమ్మని పంపాడు. అయితే సవర రాజైన విశ్వవసు, అరణ్యంలో రహస్యంగా దేవుని పూజిస్తున్నాడు. అందువల్ల విద్యాపతి ఆ స్తలాన్ని గుర్తించలేకపోయాడు. కాని విశ్వవసు కుమార్తె అయిన లలితను వివాహం చేసుకున్నాడు. అనంతరం దైవాన్ని చూపించమని విశ్వవసుని పదే పదే అర్ధించడం వల్ల, అల్లుని కళ్ళకు గంతలు కట్టి నీలిమాధవుడున్న గుహ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. యుక్తి పన్నిన విద్యాపతి దారిపొడవునా ఆవాలు చల్లుకుంటూ వెళ్ళాడు. కొన్ని రోజులకే ఆ ఆవాలు మొలకెత్తాయి. అప్పుడు గుహ చేరుకోవటం. తేలిక అయ్యింది. ఈ విషయం తెలిసిన ఇంద్రద్యుమ్న మహారాజు వెంటనే దైవాన్ని పూజించటానికి ఒరిస్సా వచ్చాడు. గుహ దగ్గరకు వెళ్ళిన రాజుకి నిరాశే మిగిలింది. అక్కడ వుండవలసిన రూపం అదృశ్యమయింది. అయితే దేవుడి భూమిలో దాక్కున్నాడని తెలుసుకున్న రాజు భగవత్ సాక్షాత్కారం కలగనిదే అక్కడినుంచి వెళ్లకూడని నిశ్చయించుకున్నాడు. అంతే కాదు ఆయన కనబడే వరకు పచ్చి గంగ కూడా ముట్టనని శపథం చేసాడు. అప్పుడు ఆకాశవాణి 'రాజా ! నువ్వు భగవంతుణ్ణి దర్శించగలవు' అని పలికింది . ఆ తరువాత రాజు అశ్వమేధ యాగం చేసి విష్ణు దేవాలయం నిర్మిచాడు. నారదునిచే తీసుకు రాబడిన నరసింహ మూర్తిని ప్రతిష్టించాడు.
ఒక రోజు నిదురిస్తున్న రాజుకి జగన్నాధుడి కలలోకి వచ్చి దివ్య స్వరంతో ' సముద్రంలో సుగంధభరితమైన ఒక కొయ్య దుంగ కొట్టుకు వస్తున్నది, ఆ దుంగతో మూర్తులను తయారు చేయించుకొమ్మని' చెప్పాడు. నిద్దురనుండి మేల్కొన్న రాజుకి స్వప్నం లో జగన్నాధుడు చెప్పినట్టుగానే సముద్రంలో నుండి దుంగ అలలపై తేలియాడుతూ తీరానికి చేరినది. దానితో దేవతా మూర్తులను చేయించాలని నిశ్చయించుకున్నాడు. శిల్పాలు చెక్కే "దారు శిల్పులకోసం" రాజు అన్వేశిస్తుండగా ఒక వృద్ధ శిల్పి అక్కడికి వచ్చి తాను శిల్పాలు చేక్కుతానన్నాడు. అయితే అందుకు ఒక షరతు విధించాడు. తనకు ఒక గది ఇవ్వాలని, శిల్పాలు చెక్కడం పూర్తయ్యేంతవరకు తనను ఎవ్వరూ కదిలించకూడదు అని అన్నాడు. రాజు అంగీకరించాడు. అయితే ఎన్నాళ్ళకు గుడి తలుపులు తెరుచుకోకపోవడం, అందులో నుంచి శిల్పాలు చెక్కే శబ్ధాలు వినిపించక పోవడంతో ఉత్సుకత పట్టలేక రాజు గుడి తలుపులు తెరిచాడు. అంతే మొండెం వరకు చెక్కిన విగ్రహాలను అక్కడే వదిలేసి శిల్పి అదృశ్యమయ్యాడు. దిక్కుతోచక రాజు ఖిన్నుడయ్యాడు. అప్పుడు జగన్నాధుడు కళ్ళముందు సాక్షాత్కరించి " ఓ రాజా! దిగులు చెందకు, వీటిని ఇలాగే ప్రతిష్టించు" అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు జగన్నాధుడు, సుభద్ర, బలభద్రుడు, చక్ర సుదర్శనాలను ప్రతిష్టించినాడు. ఈ విగ్రహాలను రత్న మాణిక్యాలతో అలంకరించి వేదికపై నిలిపాడు.
రధయాత్ర :
పూరీ దేవాలయం రధయాత్రకు ప్రసిద్ధి, ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ఈ రధయాత్ర జరుగుతుంది. 125 మంది కళాకారులు ప్రత్యేకమైన చెక్కను తీసుక వచ్చి ముగ్గురు మూర్తులకు రధాలు తయారుచేస్తారు. ఒరిస్సా రాజావంశీకులు సిధ్ధంగా వున్న రధాలను బంగారు చీపురుతో శుభ్రం చేసి నీలు చల్లుతారు. ఆ తరువాత రధం మీదకు భగవంతుని తీసుకు వస్తారు. ఇదొక అరుదైన ఆచారం. దేవునిముందు రాజు, పేద సమానమే! దేవునికి ఊడిగం చేయడమంటే ఇదే! అంతే కాక ఈ విగ్రహాలకు లేపనంగా పూయడానికి కస్తూరిని నేపాల్ రాజు వీరేంద్ర ఆనవాయితీగా పంపేవారు. ఇలా ప్రభువులంతా ఈ దేవునికి సేవచేయడమంటే అది వారికి లభించిన అదృష్టంగా భావిస్తారు.
జగన్నాధుని రధాన్ని లాగడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. ఆలయం ముందు భాగంలోని వీధిని రధయాత్రకోసమే విశాలంగా వుంచారు. తన దగ్గరకు రాలేని భక్తులకోసం భగవంతుడే స్వయంగా భక్తులకు దర్శనమివ్వడానికి బయటకు వస్తాడు. కులమత భేదాలు లేకుండా అందరూ ఇందులో పాల్గొనడం విశేషం. ఈ జగత్తుకే నాధుడైన ఆ జగన్నాధుడు తానే కదలి వచ్చే కమనీయ దృశ్యం ఈ రధయాత్ర. ఈ రధాన్ని గట్టిగా పేనిన తాళ్లతో లక్షలాది మంది భక్తులు లాగుతుంటే, మధ్య మధ్యలో రధ చక్రాలు కదలనని మొరాయిస్తాయి. అపుడు వేలకొద్ది కొబ్బరి కాయలు కొడతారు. అప్పుడు కూడా కదలకపోతే ఆ దేవునికి ఉత్సాహం తెప్పించడం కొరకు సవరలు పలికే బూతు పదాలు, భాజా భజంత్రీలు, గంటల ధ్వనులు, భజనలు, కీర్తనలు, ప్రార్ధనలు జోరుగా సాగుతుంటే అప్పుడు రధం ముందుకు సాగుతుంది. ఈ రధయాత్ర సుమారు
3 కి. మీ. పొడవునా జరుగుతుంది. భక్తులు భగవంతుని ఒకే పిలుపుతో పిలుస్తూ చేసే ధ్వనులకు భూమి దద్దరిల్లి పోతుందేమో అని అనిపిస్తుంది. తర తమ భేదం, భాషా ద్వేషం, మంచి చెడు పదాలు... ఇటువంటి వాటికి ఇక్కడ తావు లేదు. ఎవరు ఎలా పిలచిన, ఏవిధంగా నిందించిన ఇద్దరినీ సమానంగా చూస్తాడు భగవంతుడు అని ఈ రధయాత్ర నిరూపిస్తుంది.
ప్రసాదాలు :
జగన్నాదునకు 54 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. ప్రసాదంగా వండే అన్నాదులను కుండలో మాత్రమే వండుతారు. ఏడు కుండలను ఒకదానిమీద ఒకటి పెట్టి అన్నం, పెసర పప్పుతో తయారు చేసి దేవునికి నివేదన చేస్తారు. విచిత్రమేమిటంటే ఏడు కుండలోని అన్నం ఒకే సారి ఒకే విధంగా వుడుకుతుంది, లక్షమందికి ఒకే సారి వంట చేయగల వంటశాల ఇక్కడ వుంది. ఇది ఇక్కడి మరో ప్రత్యేకత. అన్నార్తులు ఉండకూడదనే శ్రీ కృష్ణుని మనోరధం ఇక్కడ నెరవేరుతుంది.
లక్షమందికి ఒకేసారి అన్నదానం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అందుకే " సర్వం జగన్నాధం " అంటారు. లక్షలమంది రధాన్ని లాగడానికి ముందుకు వస్తారు. భక్తులంతా ఈ పండగను అత్యంత ఆనందంతో ఆస్వాదిస్తారు. ఏడాదికొక్కసారి వచ్చే ఈ పండుగకోసం భక్తులంతా ఈరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా ని వేయికళ్లతో సంవత్సర కాలం పాటు ఎదురుచూస్తారు......... సర్వం జగన్నాధం.
ఈ విశేష సమయంలో జగన్నాధుని కృపను మీరు, మీ కుటుంభ సభ్యులంతా పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ మీ సకల పూజలు. కాం. టీం.
|