అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.
పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకొనే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైనది.
ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకొంటారు. అయిదేళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు. పెళ్ళికాని పిల్లలు మంచి భర్తకావాలని ఈ పూజ చేస్తే, పెళ్ళైనవారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త ఆరోగ్యంగా ఉండటానికి చేస్తారు. సాధారణంగా- పెళ్ళి అయిన తరవాత పది సంవత్సరాలపాటు తప్పనిసరిగా చేస్తారు. సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే ఆఖరుసారి పూజచేసి పేరంటాలను పిలిచి వాయనాలిచ్చి కన్నులపండుగగా ముగిస్తారు
త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.
వ్రతవిధానము
ఈ రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడమ్, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కధ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షినతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం తో పెల్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.(సేకరణ:డా.శేషగిరిరావు-శ్రీకాకుళం)
అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
ఈ వ్రతంలో ఒక కథ చదువుతుంటారు. పూర్వం ఒక రాజుకు కావేరి అనే అందమైన కూతురు ఉండేది. ఆమె స్నేహితులతో కలిసి ఈ అట్లతద్ది నోమును ఎంతో భక్తితో ఆచరించింది. అందరికీ అందమైన భర్తలు లభించారు. కావేరికి మాత్రం కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులు తారసిల్లేవారు. కావేరి ఎంతో కలతచెంది అడవికి వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసింది. పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారికి తన బాధ చెప్పుకొంది.
అప్పుడు వ్రతంలో ఆమె చేసిన దోషం వలన అలా జరిగిందని ఆదిదంపతులు వివరించారు. ఆమె నోము నోచే సమయంలో ఉపవాసం వలన నీరసించిపోయింది. ఆమె అన్నలు అది తెలిసి, గడ్డితో మంటపెట్టి అది అద్దంలో చూపించి చంద్రుడని భ్రమింపజేసి ఉపవాసాన్ని విరమింపజేశారు. ఫలితంగా ఆమెకు సరియైన వరుడు దొరకలేదు. ఈ వ్రతాన్ని జాగ్రత్తగా మరొకసారి ఆచరించమని చెప్పి అంతర్థానమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. కావేరి మళ్లీ శ్రద్ధా భక్తులతో వ్రతమాచరించింది. ఫలితంగా అందమైన, శౌర్యపరాక్రమాలు కలిగినవాడు భర్తగా లభించాడు- ఈ కథను చదువుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ ముగిస్తారు.
అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తూ భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధ నారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందనీ ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తరవాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతదియ నోము మతసామరస్యానికి పెద్దపీట వేస్తుంది.