Valuable Information

యుగానికి-ఆది-ఉగాది

శ్రీ వికృతినామ సంవత్సరం
 
యుగానికి ఆది ......... ఉగాది
 

చైత్రమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే అహని
శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
ప్రవర్తయామాస తథా కాలస్య గాననామపి
గ్రహన్వారా నృనాత్మూసాన్వత్సరాదిపాన్ !!

       బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది ......... ఉగాది
సంక మంత్రాలకు ఆధారమైన బ్రహ్మకల్ప, శ్వేతవరాహకల్పమును తెలుపుతూ భగవత్ అర్చనలో భాగంగా నిత్యం
" శ్రీ మహాల్పవిష్నోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అధ్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేత వరాకాల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ' శాలీవాహనశకే " .......... అని వేదములోని కాలమానము తెలుపుతున్నది. శాలీవాహన చక్రవర్తి క్రీస్తుశకం 79 సం.|| లో పట్టాభిషిక్తుదయ్యాడు. ఆకారణంగా ఈ యుగాన్నిశాలీవాహనశకంగా పేర్కొన్నారు. క్రీస్తుశం నాలుగో శతాబ్దంలో వరాహమిహురుడు వసంత విషువత్ కాలాన్ని సంవత్సరాదిగా ప్రకటించారంటారు. చాంద్రమానాన్ని అనుసరించి మాసగణనం చేయాలని, శుక్లపక్షంతో నేలను లేక్కించాలని కమలాకరభట్టు పేర్కొన్నారని చెబుతారు. చైత్ర శుద్ధ పాడ్యమిని ప్రతిసంవత్సరము శుభదినంగా, సంవత్సరాదిగా.... ఉగాదిగా నిర్దేశించారు. చైత్రమాస శుక్ల పక్షమి ప్రతిపదాతిథి పాడ్యమి సూర్యోదయ సమయములో సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ జగత్తును రచించాడని జ్యోతిషానికి సంబందించిన హిమాద్రి గ్రంథములో చెప్పారు. సంవత్సరం ఆరంభమయ్యే రోజున సూర్యోదయం సమయంలో పాడ్యమి తిథి ఎప్పుడు ఉంటుందో ఆరోజే ఉగాది.పండుగగా నిర్దేశించారు. సృష్ట్యాదిని చరితార్థం చేయడానికే సృష్టి ఉద్భవించిన మొదటి సంవత్సరం " ప్రభవ " అన్న పేరుతో ప్రారంభమై బ్రహ్మకల్పం  అంతమయ్యేవరకు చివరి సంవత్సరం " క్షయ " నామ సంవత్సరంతో ముగియడం విశేషం.  

        భారతీయతకు మూలం వేదం. వేదంలో చెప్పబడ్డ మధు, మాధవ మాసములు జ్యోతిష శాస్త్రం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాలుగా నిర్ధారించారు. చిత్తా నక్షత్రంతో సంబంధమున్నది  చైత్రమాసం. జగత్కళ్యాణదాయకం అయిన శ్రీరామ పట్టాభిషేకానికి వసంత సమయమే సముచితమని భావించి వశిష్టాది  మహర్షులు శ్రీ రామావతారానికి ప్రేరణగా నిలిచారు. ద్వాపర యుగం ముగిసిన తరువాత విధాత కలియుగాన్ని ఈరోజే ప్రారంభిచాడని పురాణ కథనం. మహాభారత కాలంనుంచీ ఉగాది పర్వాన్ని నిర్వహిచుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
 
షడ్రుచుల పచ్చడి ... ఉగాది పచ్చడి.

        ఉగాది పండుగ రోజు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం, పూర్ణకుంభ దానం చేయడం సాంప్రదాయం. ఉగాదిరోజున సూర్యోదయానికి పూర్వమే తలంటుస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, సూర్యనమస్కారం చేసి అర్ఘ్యం, ధూప దీపాలతో కొలిచి " సంకల్పాదౌ నూతన వత్సర నామకీర్తనం" అన్నట్టు నూతన సంవత్సరం పేరు చెబుతూ సంకల్పం  చెప్పాలని ధర్మసింధువు చెబుతుంది. తరువాత వేపపూవు పచ్చడిని భగవంతునికి నివేదించి ఏమీ తినకముందే దానిని సేవించాలి. మధుర, ఆమ్ల, కటు, కషాయ, లవణ, తిక్తయను షడ్రుచుల, మేళవింపు అయిన ఉగాది పచ్చడిని సంస్కృతంలో "  నిమ్బకుసుమభక్షణం " అంటారు. వసంతకాలంలో వచ్చే రుగ్మతలను తొలగించే దివ్య ఔషధంగా  పనిచేస్తుంది ఉగాది పచ్చడి. దీన్ని సేవిస్తే.... " శతాయుర్వజ్రదేహాయుః " సర్వసంపత్కర్తాయ, సర్వారిష్టవినాశాయ నిమ్బకుసుమ భక్షణం అన్నట్టు ద్రుఢమైన దేహంతో పాటు అదృష్టం కలిగి వస్తుందని శాస్త్రవచనం.
ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు' వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే  ఔషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి, ఆహారానికి గల సంభందాన్ని చెప్పడమే కాక హిందూ పండుగలకు, ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.

ఉగాది ప్రసాదం
 

       ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆరంభం  అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా.  వడ పప్పు లో వాడే పెసరపప్పు చేస్తుంది. కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం  తీసుకోవాలన్నసూచన ఈ ఆచారంలో నిభిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం కూడా ఉంది. ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రలు  కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది
పూర్ణకుంభదానం :

         ఉగాది పర్వదినాన పూర్ణకుంభదానం శేయస్కరమైనది. దీనినే ధర్మఘటదానం, ప్రపాదానం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే యధాశక్తి  రాగి, వెండి పంచలోహాలతో లేదా మట్టితో చేసిన కొత్త కుండను అయినా కలశంలా చేసి దానం చేసినట్లయితే నూతన సంవత్సరంలో పరిపూర్ణ మనోరధులవుతామని, కోరికలన్నీ నేరువేరుతాయని నమ్మకం. నూతన వస్త్రాలు, పూర్ణకుంభదానం పురూహితునకుగానీ, గురువునకు గానీ ఇచ్చి వారి ఆశీస్సులు పొందటం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. 

పంచాంగ శ్రవణం

        పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగములు కలది. సంపదకోసం తిథి, దీర్ఘాయువుకోసం వారం, పాపవిముక్తికోసం నక్షత్రం, రోగవిముక్తి కోసం యోగం, విజయం కోసం కరణం అను పంచాంగాములను ఉగాది పర్వదినం రోజు తెలుసుకోవాలి. సదాచారం అయిన పంచాంగ శ్రవణం వలన నూతన సంవత్సరంలో కలగబోయే ఆదాయ, వ్యయములు, శుభాశుభములు, గ్రహచారాలు ముందుగా తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని గ్రహించాలి. సంవత్సరాదిపతులైన రాజాది నవనాయకుల ఫలితాలు వినటం వల్ల గ్రహ దోషములు తొలగిపోతాయి. ఉగాది రోజున పంచాంగం విన్నవారికి దోషాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి. 
 తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా మానవునికి గంగా స్నానం చేసినంత సమానమైన పుణ్య ఫలం లబిస్తుంది. శాస్త్రవిదిగా పంచాంగం విన్నవారికి, చదివినవారికి సూర్యునివలన శౌర్యం, తేజస్సు, చంద్రుని వలన భాగ్యం, వైభవం, కుజుని వలన సర్వ మంగాళాలు, బుధుని వలన బుద్ధి వికాసం, గురుని వలన జ్ఞానం, శుక్రుని వల్ల సుఖం, శనివల్ల దుఃఖ రాహిత్యం, రాహువుచేత ప్రాబల్యం, కేతువు వలన తనవర్గంలో ప్రాబల్యం కలుగుతుందని విశ్వాసం.విరోధిని దాటి వికృతి నామసంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం కనుక " స్వస్త్యస్తు విశ్వస్యఖలః ప్రసీదతాం "  అంటే సర్వ జగత్తుకూ శుభం కలగాలని,సర్వ ప్రాణులు పరస్పర శుభాన్ని కోరుకోవాలని, ప్రజలందరి మనస్సు మంగళప్రదమవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ........
శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ సకలపూజలు.కాం. 

 

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb